Zechariah 13

1ఆ రోజున పాపాలను, అపవిత్రతను పరిహరించడానికి దావీదు వంశీకుల కోసం, యెరూషలేము నివాసుల కోసం ఒక ఊట తెరవబడుతుంది.

2ఇదే సేనల ప్రభువు యెహోవా వాక్కు. ఆ రోజున దేశంలో ఇకపై మరెన్నడూ గుర్తుకు రాకుండా విగ్రహాల నామరూపాలు లేకుండా వాటన్నిటినీ ధ్వంసం చేస్తాను. అన్య దేవుళ్ళ ప్రవక్తలను, అపవిత్రాత్మను దేశంలో లేకుండ చేస్తాను.

3ఇక ఎవడైనా ఆత్మ పూని ప్రవచనం చెప్పడానికి ప్రయత్నిస్తే వాడి తలిదండ్రులు, <<నువ్వు యెహోవా నామం పేరట అబద్ధం చెప్తున్నావు కనుక నువ్వు తప్పక చావాలి>> అని చెప్పాలి. వాడు ప్రవచనం పలికినప్పుడు వాడి తల్లిదండ్రులే వాణ్ణి పొడిచి చంపాలి.

4ఆ కాలంలో ప్రతి ప్రవక్త తాము పలికిన ప్రవచనాలను బట్టి, తమకు కలిగిన దర్శనాన్ని బట్టి సిగ్గుపడతారు. ఇకపై ఇతరులను మోసం చేయడానికి గొంగళి ధరించడం మానివేస్తారు. 5వాడు <<నేను ప్రవక్తను కాను, వ్యవసాయం చేసేవాణ్ణి, చిన్నప్పటి నుంచి నన్ను కొన్న ఒకడి దగ్గర పొలం పని చేసేవాడిగా ఉన్నాను>> అంటాడు.

6<<నీ చేతులకు ఉన్న గాయాలు ఏమిటి?>> అని ఎవరైనా వాణ్ణి అడిగితే, <<ఇవి నా స్నేహితుల ఇంట్లో ఉన్నప్పుడు నాకు తగిలిన దెబ్బలు>> అని వాడు చెబుతాడు.

7ఖడ్గమా, నా గొర్రెల కాపరి మీదా, నా సన్నిహితుడి మీదా పడు. గొర్రెలు చెదరిపోయేలా వాటి కాపరిని సంహరించు. బలహీనుల మీద నేను నా చెయ్యి ఉంచుతాను. ఇది యెహోవా వాక్కు.

8దేశమంతటిలో మూడింట రెండు వంతులవారు నశిస్తారు. మూడవ భాగం మిగిలి ఉంటారు.

ఆ మూడవ భాగాన్ని నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుభ్రపరచినట్టు శుద్ధి చేస్తాను. బంగారాన్ని పరీక్షించినట్టు వారిని పరీక్షిస్తాను. వారు నా నామాన్నిబట్టి మొరపెట్టినప్పుడు నేను వారి మొర ఆలకిస్తాను. <<వీరు నా ప్రజలు>> అని నేనంటాను. <<యెహోవా మా దేవుడు>> అని వారు అంటారు.

9

Copyright information for TelULB